👉 నేడు మనస్ఫూర్తిగా ‘అర్ధాంగి’ని ప్రశంసించండి...!ఆర్థిక భారం మోసేది భర్త... కుటుంబ భారాన్ని మోసేది భార్యజీవనయానంలో ఇద్దరి ప్రాధాన్యం ఒకటే కుటుంబ రథం సాఫీగా సాగేది అప్పుడే సంప్రదాయ సంకెళ్లను దాటిరాని మగ మహారాజులు భార్య శ్రమను గుర్తించేది అతి తక్కువ మంది ఒక్క ప్రశంస ఆమె కష్టాన్నే మరిపిస్తుంది దూరమవుతున్న అనుబంధాల ఒడి సంప్రదాయ సంకెళ్లు తెగినా దొరకని ఊరట యాంత్రిక జీవనంలో దరిచేరని బంధాలు నేడు భార్యను ప్రశంసించే రోజు...


"నువ్వంటే నాకిష్టం...నీ నవ్వంటే నా కిష్టం..." అంటూ రోజులో ఏదో ఒక సందర్భంలో భార్యతో అంటే ఆమె ఫీలింగ్‌ ఎలా ఉంటుందో గమనించండి. ఆమె మురిసిపోతుంది. మైమర్చిపోతుంది. ఎందుకంటే ‘ఆమె’ కోరుకునేది అదే. ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది’ అన్నమాట కాగితాలకే పరిమితం చేసే మనం ఆమె కష్టాన్ని మరిపించే ఒక్క మాటైనా మాట్లాడడానికి ‘అహం’ ఫీలవుతాం. కుటుంబ భారాన్ని మోసేది భర్త...కుటుంబాన్ని నడిపించేది భార్య...ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. కాలంతోపాటు వచ్చిన మార్పుల్లో ఇప్పుడు దంపతులిద్దరూ బాధ్యతలను, భారాన్ని సమానంగా పంచుకుంటున్నారు. అటువంటప్పుడు ప్రశంసలు కూడా ఇద్దరికీ దక్కాలి. అదే అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. మనకోసం అనుక్షణం కష్టపడే భార్యను ప్రశంసించడం భారం కాదు...బాధ్యత.


 కుటుంబమనే రథానికి భార్యభర్తలు జోడుగుర్రాలు. ఒకేలా సాగితేనే ప్రయాణం సాఫీ అవుతుంది. కష్టం ఇద్దరిదీ అయినప్పుడు ప్రశంసలు ఒక్కరికే పరిమితం కాకూడదు. భర్త తన భార్యను మరో తల్లిగా భావిస్తే... భార్య తన భర్తను తొలిబిడ్డగా భావిస్తుందట. అటు వంటి దాంపత్యంలోనే అన్యోన్యత వర్థిల్లుతుంది. అనుబంధం కలకాలం నిలవాలంటే పొగడ్తలు, ప్రశంసలే టానిక్కులు. కాపురంలో ఈ చికిత్స ఎన్నాళ్లు కొనసాగితే ఆ దాంపత్యం అన్నాళ్లు ఆరోగ్యంగా ఉంటుంది. భర్త నోటి నుంచి వచ్చే చిన్న ప్రశంసను భార్య ఓ వరంలా భావిస్తుంది. అందుకోసం ఎదురు చూస్తుంది. దానికి ఉన్న మహత్యం అటువంటిది. ప్రశంస ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకే ఏటా సెప్టెంబర్‌ 18న ‘భార్యల ప్రశంసల దినోత్సవం’ జరుపుకొంటారు. నేడు భార్యను ప్రశంసించే రోజు సందర్భంగా ప్రత్యేక కథనం ఇది.


తోడు...నీడ

పరమశివుడ్ని అర్థనారీశ్వరుడంటారు. భార్యను తన అర్థభాగం చేసినందుకు ఆయనకు దక్కిన గౌరవం ఇది. సృష్టిస్థితిలయకారకుడైన భగవంతుడే భార్యకు అర్థభాగమిస్తే సామాన్యమానవులం మనం మాత్రం ‘ఆమె’పట్ల నిర్లక్ష్యం చూపుతుంటాం. ప్రతి దాంపత్యంలోను భార్యాభర్తలిద్దరూ సరిసమాన పాత్రధారులు. భార్యాభర్తలు తోడూనీడ వంటివారు. మెట్టినింట అడుగుపెట్టిన మహిళకు తొలిరోజుల్లో భర్తే సర్వస్వం.ఇల్లే స్వర్గంగా...భర్త, పిల్లలే దేవుళ్లుగా భావిస్తుంది. తెల్లవారు జామున నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి తొలిజామున నిద్రపోయే వరకు ఎంతో శ్రమిస్తుంది. రుచికరమైన వంట చేసి వడ్డించడం నుంచి ఇంటిని అందంగా అలంకరించుకునే వరకు అన్నింటా ఆమె ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తుంది. భర్తను మురిపించాలని, మెప్పించాలని ఆశిస్తుంది. ఆయన ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. కానీ ఆమె కష్టాన్ని, శ్రమను గుర్తించే మగ మహారాజులు అతి తక్కువంటే అతిశయోక్తి కాదు. ఆఫీసులో తామే కష్టపడుతున్నామని, భార్య ఇంట్లో ఉండి చేసేదేముందిలే అన్న భ్రమలో బతికేస్తుంటాం. ‘శభాష్‌...బాగా చేశావ్‌’ అన్న ఒక్కమాట కోసం ఆమె ఎదురుచూస్తోందన్న విషయాన్ని గుర్తించరు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎదురుచూపు ఎప్పుడు ఫలించినా ఆమె కష్టం అప్పటితో మర్చిపోతుంది. లేదంటే మరో రోజుకోసం ఎదురు చూస్తుంది.

యాంత్రిక జీవనం

ఒకప్పుడు సంప్రదాయ సంకెళ్లు...ఇప్పుడు యాంత్రిక జీవనం...మహిళకు శాపం అనవచ్చు. ఒకప్పుడు భర్తే దైవం...ఆయన మాటే వేదం...భార్య వంటింటికే పరిమితం అన్న పెద్దలమాట వల్ల భార్య కష్టానికి గుర్తింపు లేకుండా పోయేది. కాలంతోపాటు మహిళ ప్రాధాన్యం పెరిగినా ఆమె కష్టానికి తగిన గుర్తింపు మాత్రం లభించడం లేదు. యాంత్రిక జీవనంలో పడిన మనిషి బంధాలు, అనుబంధాల ఒడిని చేరుకోలేకపోతున్నాడు. సంపాదన యావలో పడి.. భార్యాపిల్లలకు ప్రేమ, ఆప్యాయతలుపంచే బాధ్యతను విస్మరిస్తున్నాడు ‘అహం’ అనే చట్రంలో చిక్కుకున్న ఎందరో భర్తలు కనీసం ‘బాగాచేశావ్‌’ అన్న మాటకూడా అనడానికి ఇష్టపడడం లేదు. ఎవరిపని వారిదే అన్నట్లు అంటీ ముట్టనట్లు వ్యవహరించే దంపతులు ఎందరో తారసపడుతున్నారు. పెళ్లి అనే ‘బంధం’లో తప్ప ఆప్యాయతా అనురాగాల ‘అనుబంధం’ను పెంచుకోలేకపోతున్నారు.

నిర్లక్ష్యం...అహం

భార్యంటే అన్నింటా తనకంటే తక్కువని, ఇంటి యజమానిగా తను గీసిన గీతే శాసనమని, కుటుంబ సభ్యులెవరికీ ఎదురు చెప్పే హక్కులేదని, భార్యంటే వంటింటికే పరిమితం కావాలన్న సంప్రదాయ వాదులు ఇప్పటికీ మనకు తారసపడుతుంటారు. పుట్టుకతో వచ్చిన అహం, నిర్లక్ష్య భావంతో కొందరు భార్యను ప్రశంసించేందుకు ఇష్టపడరు. భార్య శ్రమను గుర్తించకపోగా, అది ఆమె బాధ్యతగా భర్తల ఆలోచన. ఇటువంటి దంపతుల మధ్య బంధం కూడా అంతే కృత్రిమంగా ఉంటుంది. సంప్రదాయ సంకెళ్ల మధ్య బందీలుగా తప్ప ఆప్యాయ తానురాగాల బంధం వారి మధ్య కనిపించదు. అదే భార్యచేసే పనిలో కష్టాన్ని, ప్రేమను, ఆప్యాయతను, బాధ్యతను గుర్తించి గౌరవించే భర్తకు ఆమె మనసులో శాశ్వత స్థానం లభిస్తుంది. ఆ భర్తపట్ల ఆరాధన, గౌరవం పెరుగుతాయి.


సందర్భం వచ్చినప్పుడల్లా...

భార్యను ప్రశంసించడంలో కృత్రిమత్వం ఉండకూడదు. మీరిచ్చే కాంప్లిమెంట్‌లో వంద శాతం నిజాయితీ కనిపించాలి. సందర్భానికి తగ్గట్టు ప్రశంస ఉంటే ఆమె మురిసిపోతుంది. మైమర్చి పోతుంది. మీపట్ల ఆరాధన పెంచుకుంటుంది. భార్య పదిరోజులు పుట్టింటికి వెళ్లింది. చేతిపాకమో, హోటల్‌ తిండితోనే గడిపిన మీరు ఆమె తిరిగి వచ్చాక చేసిన వంట తింటూ ‘మళ్లీ నోటికి జీవం వచ్చింది. నీ చేతి వంట తినకుంటే నాకు ఏదోలా ఉంటుంది’ అంటూ ప్రశంసించి చూడండి. ఆమె మోము అరవిరిసిన మందారంలా విచ్చు కుంటుంది. ఆ ప్రశంసలో వందశాతం నిజాయితీని ఆమె గ్రహిస్తుంది. అందుకే టీ, టిఫిన్ పెట్టినప్పటి నుంచి రాత్రి పడుకునేముందు వరకు ఏదో ఒక సందర్భంలో భర్తగా ఆమె మనసుకు సాంత్వన పలికే ఒక్క మాట చాలు ఆమె తన రోజంతటి కష్టం మర్చిపోయేందుకు.

ఆలోచనా విధానం మారాలి

భార్య అనగానే వంటపని, ఇంటిపని చూసుకునే మహిళ అన్నది సగటు భర్త ఆలోచన. ఈ విధానం మారాలి. ఆఫీసులో భర్త చేసే పనికంటే పది రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని సాకడం, ఇంటి పనులు చేయడమే భార్య విధి అని, మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం. కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. పదిమందిలో ఉన్నప్పుడు ఆమె గురించి రెండు మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ‘ప్రాధాన్యం’ గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ‘ఇదేం గొప్పా...ఇంతేగా నువ్వు చేసేది’ వంటి పదాలు వాడక పోవడం మంచిది.

సమస్యలు...సూచనలు

దంపతుల మధ్య ప్రతి విషయంలోనూ నిజాయితీ కొనసాగాలి. నిజాయితీగా వ్యవహరించనప్పుడు మనస్పర్థలు సహజం.సందర్భం ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అవగాహనతో వ్యవహరించాలి.ఎవరివల్ల సమస్య ఎదురైనా పరస్పరం చర్చించుకుని పరిష్కారానికి మార్గాలు వెదకాలి. సాకులతో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిస్థితి జఠిలమవుతుంది.పుట్టి,పెరిగిన వాతావరణం వేరుగా ఉండడం, మెట్టినింట వాతావరణం భిన్నంగా ఉన్నప్పుడు అలవాటుపడేలా ప్రోత్సహించాలి. అర్థం చేసుకునేలా కౌన్సెలింగ్‌ చేయాలి. తూలనాడడం, చిన్నబుచ్చడం మంచిదికాదు.ఉద్యోగులైతే మిస్‌ అండస్టాండింగ్‌కు దూరంగా ఉండాలి. సమయపాలన విషయంలో పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించాలి. అపోహపడితే ఇబ్బందులే.పని విభజన చేసుకుని పరస్పరం సహకరించుకోవాలి తప్ప ‘నీదే బాధ్యత’ అన్న మాట రాకూడదు.లైంగికపరమైన అపోహలను దరిచేరనివ్వకూడదు. సమస్య ఉంటే సైకాలజిస్ట్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప ‘నువ్వే కారణం’ అనకూడదు.వ్యవసానాలకు బానిస కావడం, బాధ్యతలేకుండా వ్యవహరించడం, ఆర్థిక ఇబ్బందులు సమస్యకు కారణం.

 ఎదురుచూపు గుర్తించాలి

ఇంటిపనితో ఎంతో సతమతమయ్యే భార్య రోజులో ఒక్క సందర్భంలోనైనా భర్త ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపును గుర్తించినప్పుడే ఆమెపట్ల మనకున్న నిజమైన ప్రేమ బయటపడుతుంది. తమకోసం తన సర్వస్వంధారబోసే భార్య ఎదురు చూపును గుర్తించడం మర్చిపోతుంటారు. దీంతో ఆమె మనోవేదన అనుభవిస్తుంది. ఆమె పడుతున్న మనోవేదననూ గుర్తించలేని వారు ఎందరో ఉన్నారు.

‘ప్రత్యేకం’గా గుర్తుంచుకోవాలి

భార్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను, రోజులను గుర్తుంచుకోవాలి. పుట్టిన రోజు, పెళ్లిరోజు, ముఖ్యమైన రోజులను గుర్తుంచుకుని విష్‌ చేస్తూ ఉండాలి. రోజులో ఒక్కసారైనా ప్రేమగా నవ్వుతూ మాట్లాడాలి. వారానికి ఒక్కసారైనా భార్యను, పిల్లలను బయటకు తీసుకువెళ్లాలి. దంపతుల్లాకాకుండా స్నేహితుల్లా మెలుగుతూ కష్టసుఖాలను పంచుకోవాలి. ఒకరికి కోపం వస్తే మరొకరు తగ్గాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది.

అనుక్షణం గుర్తుంచుకోవాలి

భార్యను అనుక్షణం గుర్తుంచుకో వాలి. ఆమెకు సంబంధించిన విష యాల్లో ప్రత్యేకంగా విష్‌ చేయడం ద్వారా ఆమె మనసు చూరగొన వచ్చు. రోజులో ఒక్క క్షణమైనా భార్యతో ప్రేమగా మాట్లాడి ఆమె అవసరాలు అడిగి తెలుసుకోవాలి. చేసే పనిలో కాస్తంత ప్రేమను చూపించి బాగుందంటూ ఆమెను మెచ్చుకోవాలి. ఏ సందర్భం లో నైనా భార్యను నొప్పించకుండా ఆమె మనసు తెలుసుకుని మాట్లాడగలిగిన వ్యక్తే భర్తగా వందశాతం మార్కులు సాధించి నట్టు. మాట్లాడేటప్పుడు సునితత్వాన్ని ప్రదర్శించాలి. ఆమె పట్లే కాదు ఆమె బంధువులను, కుటుంబ సభ్యుల గురించి కూడా తక్కువచేసి మాట్లాడకూడదు. దానివల్ల ఆమె చిన్నబుచ్చుకునే అవకాశం ఉంది.

గుర్తింపును ఆశిస్తారు

భర్త ప్రశంసలు, పొగడ్తలను ప్రతి భార్య కోరుకుంటుంది. తను చేసే ప్రతిపనికి గుర్తింపును ఆశి స్తుంది. రోజులో ఒక్కసారైనా భర్త నుంచి ‘బాగుంది’ అన్న మాట కోసం ఎదురు చూస్తారు. భార్యను ప్రత్యేకంగా చూడడంతోపాటు వారి లో ఉన్న ప్రత్యేకతను గుర్తించాలి. వీలైనప్పుడల్లా వారితో మనస్ఫూర్తిగా మాట్లాడుతూ పనిలో సాయాన్ని అందిస్తూ ఉండడం ద్వారా ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. భర్త, పిల్లల కోసం, కుటుంబం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసేది భార్య మాత్రమే. అటువంటి భార్యను వీలున్నప్పుడల్లా ప్రశంసించడం, ప్రత్యేకంగా అభినందించడం వల్ల పోయేదేమీ ఉండదు. అలా చేయడం వల్ల దాంపత్య బంధం బలపడుతుంది.

No comments:

Post a Comment